- మద్యం తాగించి కారుతో వెనుకనుంచి ఢీకొట్టించి హత్య
- రూ.66 లక్షల కోసం నలుగురితో కలిసి ప్లాన్..
- యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు యత్నం..ఖమ్మంలో ఘటన..
ఖమ్మం రూరల్, వెలుగు: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మరో నలుగురితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. ఈ అమానవీయ ఘటన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఖమ్మం నగరం గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న చాగంటి రవి (55) పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య చాగంటి ప్రశాంతి (40) తోపాటు బావమరిది వరుసయ్యే దేశబోయిన శ్రీనివాస్ (30), జోగి రాజ్ కుమార్ (28), జోగి వెంకటేశ్ (36), జోగి రాంబాబు(36).. ప్లాన్ ప్రకారం రూ. 66 లక్షల ఇన్సూరెన్స్ చేయించారు.
ఆ డబ్బులతో పాటు రవికి చెందిన ఎర్టిగా కారును కూడా అమ్ముకుందామని ప్లాన్ వేశారు. ప్రమాదంలో రవి మృతి చెందితే డబ్బులు క్లెయిమ్ చేయొచ్చని.. యాక్సిడెంట్ చేసి చంపుదామని స్కెచ్ గీశారు. ముందుగానే వేసిన ప్లాన్ ప్రకారం ఈ నెల 2న రవికి కాల్ చేసి మందు తాగుదామని బయటకు తీసుకెళ్లారు. రవికి బాగా మద్యం తాగించిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పి రూరల్ మండలం ఎం వెంకటాయపాలెం ఊరి చివరి దించి.. ఆ నలుగురు ఆటోలో వెళ్లిపోయారు.
మద్యం మత్తులో ఉన్న రవి వెంకటాయపాలెం వైపు రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం.. వెంకటేశ్‌కు చెందిన కారును జోగి రాజ్‌కుమార్ వేగంగా నడుపుకుంటూ వచ్చి రవిని వెనుకనుంచి ఢీ కొట్టాడు. దీంతో రవి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. అనతరం నిందితులు తనగంపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్ స్నేహితుడు దంచినాలు సురేశ్ ఇంటి వద్ద కారును పెట్టి.. కవర్ కప్పి వెళ్లిపోయారు.
అనంతరం జరిగిన విషయం తనకు తెలియనట్లు రవి భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి కేసును వారం రోజుల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి ఒక కారు, ఆటో, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో ముష్క రాజు తెలిపారు.
